Thursday, 8 December 2016

బిడ్డలను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో షికారు

కీవ్‌ :
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను అపార్ట్‌మెంట్‌లోనే ఉంచి లాక్‌ చేసివెళ్లిపోవడంతో ఒక బిడ్డ చనిపోయిన విషాద సంఘటన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం కీవ్‌కు చెందిన వ్లాడిస్లావాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి డేనిల్‌, అమ్మాయి అనా. ఇద్దరి వయస్సు రెండు సంవత్సరాలలోపు వుండటం గమనార్హం. తొమ్మిదిరోజుల ముందు ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఎవరూ తోడులేని సమయంలో చిన్నపిల్లలు ఆకలితో అలమటించారు. పెద్దవాడైన డేనిల్‌ చనిపోగా అనా అపస్మారకస్థితిలోకి వెళ్లింది. తొమ్మిదిరోజుల అనంతరం తల్లి వచ్చి లాక్‌ తీసి చూడగా గుండెల్ని ద్రవింపజేసే ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని అనాను ఆసుపత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్‌లో అనేక కుటుంబాల వారు నివసిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఏడుపులు విని అనుమానంతో పోలీసులకు సమాచారం అందించినా వారు రాలేదని అపార్ట్‌మెంట్‌ వాసులు ఆరోపించారు. పిల్లలు ఆకలితో ఇలా బాధపడుతారని ఆలోచించలేదని తల్లి చెప్పడం గమనార్హం. పిల్లల ఏడుపులు విన్నా తలుపులు బద్దలు కొట్టివుంటే డేనిల్‌ను ప్రాణాలను కాపాడినట్టు వుండేదని కొందరు అభిప్రాయం వ్యక్తంచేశారు. మొదటి భర్త సంతానం కాబట్టే వారిని నిర్లక్ష్యంగా వదిలివేసిందని బాలల హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఉక్రెయిన్‌ చట్టాల ప్రకారం ఆమెకు కనీసం ఎనిమిదేళ్లు శిక్ష పడే అవకాశముంది.

No comments:

Post a Comment