Friday 16 December 2016

పెద్ద నోట్ల రద్దు.. చైనాకు పండగ!

న్యూఢిల్లీ:
 మన దేశంలో అధిక విలువ కలిగిన నోట్ల రద్దు పొరుగు దేశమైన చైనాకు కలిసి వచ్చేలా చేసింది. నగదు రహిత లావాదేవీల వ్యవస్ధ అవినీతి అంతమొందిస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. నాటి నుంచి నేటి వరకూ చేతిలో డబ్బు కోసం దేశమంతా బ్యాంకుల ముందు క్యూ కట్టింది. దీంతో డిజిటల్ లావాదేవీల సంఖ్యను పెంచేందుకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) లేదా స్వైపింగ్ మిషన్లను 10 వేలకు పైచిలుకు జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

అయితే కేవలం నగరాల్లో మాత్రమే విరివిగా అందుబాటులో ఉన్న పీఎస్ఓ మిషన్లను గ్రామాల్లో ప్రవేశపెట్టడానికి కొరత ఏర్పడింది. దేశీయంగా పీఎస్ఓలను తయారుచేసే కంపెనీలకు అవసరమైన మేరకు తక్కువ సమయంలో లోటును పూడ్చే సామర్ధ్యం లేకపోవడంతో చైనాలోని రెండు కంపెనీల నుంచి పీఎస్ఓ లను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక శాఖ సంబంధిత కన్సల్టేటివ్ కమిటీ సమావేశ అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు.
చైనా నుంచి దిగుమతి చేసుకునే మిషన్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మిషన్లు తక్కువ ధరలకే వ్యాపారులకు అందుతాయని పేర్కొన్నారు. దిగుమతి చేసుకోవాల్సిన పీఎస్ఓల సంఖ్య లక్షల్లో ఉండటంతో నోట్ల రద్దు వల్ల చైనాకు భారీగానే కలిసివచ్చినట్లయింది. చైనా నుంచి వచ్చే ఈ మిషన్లు భారత్ కు చేరేసరికి మరికొద్ది వారాలు పడతాయని ఇప్పటికే బ్యాంకులు ప్రజలకు తగినంత డబ్బును అందించడంలో విఫలం చెందుతున్నాయని జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

No comments:

Post a Comment