Friday 23 December 2016

క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో రూ.7కోట్లు

హైదరాబాద్‌:

పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో లావాదేవీలు జరుగుతున్న ఖాతాలపై ఆదాయ పన్నుశాఖాధికారులు డేగకన్ను వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అకౌంట్‌ వివరాలు చూసిన అధికారులకు దిమ్మ తిరిగి పోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో అక్షరాలా రూ.7కోట్లు జమ అయినట్లు వారు గుర్తించారు. నవంబర్‌ రెండో వారంలో ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌లోని అతని ఖాతాలో రూ.7కోట్లు రద్దైన పాత నోట్లను జమ చేశారు. అంతకుముందు వరకూ ఆ ఖాతా నిద్రాణంగా ఉండేదని ఐటీ అధికారి ఒకరు చెప్పారు. సదరు మొత్తాన్ని ఓ బంగారం వ్యాపారి ఖాతాలోకి ఆర్‌టీజీఎస్‌ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే దీనిపై క్యాబ్‌ డ్రైవర్‌ను విచారించగా ఆ నగదు ఎక్కడ్నుంచి వచ్చింది చెప్పలేదని అధికారులు వెల్లడించారు.

ఈ అనుమానాస్పద లావాదేవీకి సంబంధించి అధికారులు బ్యాంకులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, డ్రైవర్‌ సహచరులైన ఇద్దరు నగదు డిపాజిట్‌ చేసినట్లు తేలిందని విచారణాధికారి ఒకరు తెలిపారు. వారిద్దరినీ విచారించామని వారి వాంగ్మూలాన్ని నమోదు చేశామని అధికారులు చెప్పారు.

No comments:

Post a Comment