Tuesday 13 December 2016

పెళ్లికి 90 ఇళ్లు బ‌హుమ‌తిగా ఇచ్చిందామె!

ముంబయి:

పెళ్లిళ్లకు ఉన్నంతలో భారీగా ఖర్చు చేయడం సర్వసాధారణమై పోయింది. శ్రీమంతులు చేసే వివాహాలకైతే వేరే చెప్పనక్కర్లేదు. శుభలేఖలు మొదలుకొని దుస్తులు, నగలు, కల్యాణ మండపం, విందు భోజనాలు.. ఇలా ప్రతీదీ వారి స్థాయికి తగ్గట్టుగానే ఉండాలనుకుంటారు. కానీ కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో పుట్టిన ఆ యువతి మాత్రం ఆదర్శంగా.. వినూత్నంగా ఆలోచించారు. ఆడంబరాల కోసం కాకుండా.. నిరుపేదలకు అండగా తన పెళ్లిఖర్చు ఉండాలని భావించారు. అంతే.. తన ఆలోచనలకు అనుగుణంగా నిరాడంబరంగా మూడుముళ్లు వేయించుకుని, పెళ్లికి పెట్టాలనుకున్న ఖర్చుతో 90 పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆమె మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ జిల్లాకు చెందిన శ్రేయ మునోద్‌. ఆమె అత్తంటివారు కూడా శ్రీమంతులే. శ్రేయ తన సమీప బంధువు ప్రశాంత్‌ సూచనల మేరకు పేదలకు ఏదైనా చేస్తే బాగుటుందని భావించారు. దాంతో మూడుముళ్ల బంధంతో తన కుటుంబంలో ఆనందాలను పంచుతూ.. మరికొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. తన నిర్ణయానికి ఇటు పుట్టింటివారు.. అటు భర్త, అత్తమామలు కూడా మద్దతుగా నిలిచారు. 108 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించి పనులు మొదలుపెట్టగా పెళ్లి నాటికి 90 ఇళ్లు పూర్తయ్యాయి. ఆయా పేద కుటుంబాలను పెళ్లికి ఆహ్వానించి మరీ కల్యాణ మండపంలోనే ఇళ్లకు సంబంధించిన తాళాలు వారికి అందజేసి అందరి మన్ననలు అందుకున్నారు.

No comments:

Post a Comment