Monday, 2 January 2017

మందుకొట్టి విమానం నడిపేందుకు వెళ్లాడు

మాంట్రియల్‌:

మద్యంమత్తులో బైకులు, కార్లు నడుపుతూ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో అరెస్టయిన వారి గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. కెనడాలో ఓ పైలట్‌ మందుకొట్టి విమానం నడిపేందుకు వెళ్లాడు. విమానం కాసేపట్లో టేకాఫ్‌ తీసుకోవాల్సి వుండగా, అతని ప్రవర్తనను గమించిన సిబ్బంది సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే వచ్చి పైలట్‌ ను అరెస్ట్‌ చేశారు. కెనడాలోని కాల్గరీ విమానాశ్రయంలో శనివారం ఈ సంఘటన జరిగింది.

సన్‌ వింగ్‌ కు చెందిన విమానం కాల్గరీ విమానాశ్రయం నుంచి మెక్సికోలోని కన్‌ కున్‌ కు బయల్దేరాల్సి ఉంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయాణికులందరూ వచ్చారు. కాసేపట్లో విమానం బయల్దేరాల్సి ఉంది. అయితే పైలట్‌ తూలుతూ, మద్యం మత్తులో ఉండటాన్ని విమాన సిబ్బంది గమనించారు. అధికారులు వెంటనే పైలట్‌ ను విమానంలో నుంచి దించివేశారు. అతనికి పరీక్షలు నిర్వహించగా, మూడురెట్లు అధికంగా ఆల్కాహాల్‌ ఉన్నట్టు తేలింది. పోలీసులు పైలట్‌ పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైనదని సన్‌ వింగ్ ప్రతినిధి అన్నారు. మరో పైలట్‌ ను ఏర్పాటు చేసి విమానాన్ని పంపారు. విమానంలో 99 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment